రేవంత్ రెడ్డితో భేటీకి చిరంజీవి దూరంగా ఉండడానికి కారణమదేనా, టాలీవుడ్ ఆశించింది జరిగేనా?

ఆకు వెళ్లి ముల్లు మీద పడినా, ముల్లు వచ్చి ఆకు మీద పడినా నష్టపోయేది ఆకు అన్నది నానుడి. సరిగ్గా టాలీవుడ్ కి ఇది వర్తించేలా కనిపిస్తోంది. పాలకపక్ష నేతకు కోపం వచ్చినా టాలీవుడ్ కే నష్టం. టాలీవుడ్ సెలబ్రిటీలకు ఆగ్రహం కలిగినా వాళ్లే నష్టపోతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల అల్లు అర్జున్- రేవంత్ రెడ్డి ఉదంతం అందుకు సాక్ష్యంగా ఉంది. తాజాగా టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశం అందుకు కొనసాగింపుగానే కనిపిస్తోంది.

ప్రభుత్వాలకు సినిమా నటులు ఎప్పుడూ సాఫ్ట్ టార్గెట్ గానే ఉన్నారు. కొన్ని సార్లు బెదిరించి, ఇంకొన్ని సార్లు బుజ్జగించి, అదీకాకపోతే మరికొన్ని సార్లు భయపెట్టి ఏదో మార్గంలో టాలీవుడ్ మాత్రమే కాకుండా అన్ని సినీ పరిశ్రమలను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడం పాలకులకు వెన్నతో పెట్టిన విద్య. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో అనుసరించిన పంథా మనం చూశాం. ఇప్పుడు తెలంగానాణాలో రేవంత్ రెడ్డి మరో అడుగుముందుకేసిన వైనం కనిపిస్తోంది.

బాలీవుడ్ ఆధిపత్యం ఇండియన్ సినిమా పై ఉన్నంతకాలం నేషనల్ పార్టీలు బాలీవుడ్ హీరోలను, హీరోయిన్లను తమకనుకూలంగా మలచుకున్న సందర్భాలు అనేకం. ప్రభుత్వాలకు, పాలక పెద్దలకు అవసరమయిన సందర్భంలో అవసరమైనట్టుగా వాడుకున్న అనుభవాలు ఎన్నెన్నో. ప్రస్తుతం కాలం మారుతోంది. బాలీవుడ్ హవా తగ్గిపోతోంది. టాలీవుడ్ కొన్నేళ్లుగా తడాఖా చాటుతోంది. దాంతో అనివార్యంగా రాజకీయ నేతల కన్ను టాలీవుడ్ వైపు మళ్లింది. దానికి తగ్గట్టుగా దారికి తెచ్చుకోవడం కోసం సామధానబేదదండోపాయాలు అనుసరిస్తున్నట్టు అర్థమవుతోంది.

బాలీవుడ్ బ్యాచ్ అంతా బీజేపీకి జై కొడుతున్న దశలో టాలీవుడ్ ని తన దారికి తెచ్చుకునే దిశలో కాంగ్రెస్ నాయకత్వం రేవంత్ రెడ్డికి లైసెన్స్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. దానికి అనుగుణంగానే ఆయన అడుగులున్నాయి. వాటిని సహించలేని బీజేపీ స్వరం పెంచుతున్న తీరు కూడా మరో సంకేతం. బీజేపీ అనుకూల మీడియా రాద్ధాంతం చేస్తున్న తీరు కూడా అందుకు తార్కాణం. ఎన్ కన్వెన్షన్ అంశాన్ని వాడుకుని అక్కినేనిని, సంధ్యా థియేటర్ ప్రమాదాన్ని ఉపయోగించుకుని అల్లు అర్జున్ ను కూడా తన దారికి తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది. వేర్వేరు అంశాలను అడ్డం పెట్టుకొని ఇండస్ట్రీ ప్రముఖులను తన దగ్గరికి రప్పించుకున్న తీరుతో అందరిలో ఒక క్లారిటీ వచ్చేసింది.

ఏడాదిగా సినీ రంగం మీద పెద్దగా శ్రద్ధ పెట్టని రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ఉదంతాన్ని వాడుకుని వెంటనే టాలీవుడ్ పెద్దలను తన చెంతకు రప్పించుకున్న తీరు దానిని చాటుతోంది. ఇది కేవలం రేవంత్ రెడ్డి ప్రణాళిక కాదని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రయోజనాలు కూడా అందులో ముడిపడి ఉన్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. మెగా ఫ్యామిలీ ముఖ్యంగా చిరంజీవి కూడా ఈ సమావేశానికి ఢుమ్మా కొట్టిన తీరు అందులో భాగమే. పవన్ కళ్యాణ్, చిరంజీవి సహా ఆ కుటుంబం ప్రస్తుతం బీజేపీ బాటలో ఉంది. రైట్ వింగ్ ఆలోచనలతో సాగుతోంది. వరుసగా చిరంజీవి అడుగులు పరోక్షంగా, పవన్ కళ్యాణ్ తీరు ప్రత్యక్షంగా అందుకు ఆధారంగా చూడొచ్చు. బీజేపీకి అనుకూలంగా ఉండడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం, ఆపార్టీ ప్రయోజనాలే లక్ష్యంగా చేసుకున్న సమావేశానికి దూరంగా ఉన్నట్టు భావించాల్సి వస్తోంది.

అదే సమయంలో వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కూడా ఇందులో అంతర్భాగమే. తన అహం చల్లార్చుకోవడం, పార్టీకి అనుకూలంగా కొందరిని మలచుకోవడం వంటి లక్ష్యాలతో సాగించిన సమావేశం ఎలాంటి ఫలితాన్నిస్తుందన్నది కాలమే సమాధానం చెబుతుంది. కానీ టాలీవుడ్ లో ఉన్న లోపాలను, వారి బలహీనతలను ఆధారంగా చేసుకుని తమ వైపు మళ్లించుకోవాలనే ఎత్తుగడలు మాత్రం ఆసక్తికరం. చాలాకాలంగా ఇలాంటివి అనుసరిస్తున్నప్పటికీ ప్రస్తుతం పూర్తిగా బాహాటంగా సాగిన తీరు ఆశ్చర్యంగా ఉంది. ఎలాంటి పరిణామాలకు ఆస్కారమిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *