అన్నం- చపాతి, ఏది బెస్ట్, ఏం తినాలి?

చాలామంది ఆహారం విషయంలో సందిగ్ధం ఉంటుంది. తమ ఆరోగ్యానికి ఏది మంచిదన్న సందేహాలు చుట్టుముడుతూ ఉంటాయి. ఇప్పటికీ దక్షిణాది రాష్ట్రాలలో అన్నమే ప్రధాన ఆహారం. ఉత్తరాది రాష్ట్రాలలో రొట్టెలు, చపాతీలు ఎక్కువగా తింటూ ఉంటారు.

కానీ కాలం మారుతోంది. క్రమంగా ఆహారపు ఆలవాట్లలో కూడా మార్పులు వస్తున్నాయి. షుగర్, బిపి, అధిక బరువు, హార్మోన్ సమస్యలు వంటివి ప్రభావితం చేస్తున్న దశలో అందరూ ఆహారం మీద కేంద్రీకరణ పెంచుతున్నారు.

ముఖ్యంగా ఆరోగ్యం కోసమంటూ కొందరు అన్నానికి బదులు చపాతీ తింటుంటారు. అయితే కొందరు వైద్యులు, ఆహార నిపుణులు చపాతీలు కూడా అంత ఆరోగ్యకరమైనవి ఏమీ కాదని అంటుంటారు. చపాతీ, అన్నం రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? ఆహార నిపుణులు ఏం చెబుతున్నారు తెలుసుకుంటే..

చపాతీ లేదా అన్నం రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిదన్నది నిర్దిష్టమైన కొలతలు లేవు. ఆయా వ్యక్తులు, వారి ఆరోగ్య, శారీరక పరిస్థితులను బట్టి ఉంటుంది. ఇదే విషయాన్ని వాటిని తీసుకునే వ్యక్తి ఆరోగ్యం, ఆ వ్యక్తి రోజులో తీసుకునే ఇతర ఆహారాల మీద ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అన్నం, చపాతీ రెండింటిలో ఉన్నవి కార్బోహైడ్రేట్స్ కాబట్టి, వాటి ప్రమాణాల్లో కొద్దిపాటి తేడాలే మినహా పెద్దగా మార్పులుండవు. దాంతో ఏది తినాలన్నది వ్యక్తుల పరిస్థితి మీద ఆధారపడి ఉంటుందన్నది గ్రహించాలి.

చపాతీలు, అన్నం రెండింటిని పోలిస్తే చపాతీలో అన్నం కంటే స్వల్ప స్థాయిలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కానీ సాధారణం బియ్యం అంటే పాలిష్ పెట్టిన బియ్యానికి బదులు బ్రౌన్ రైస్, ముడి బియ్యం వంటి బియ్యంలో చపాతీ కంటే తక్కువ కార్బోహేడ్రేట్స్ ఉంటాయి.

గోధుమ పిండితో చేసిన చపాతీల కంటే సజ్జలు, జొన్నలు, రాగులు మొదలైన వాటితో చేసే చపాతీలు, రొట్టెలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్, ఫాస్పరస్, ఐరన్ మొదలైనవి ఎక్కువగా ఉంటాయి.

అన్నం కంటే రొట్టెలు, చపాతీలలో పైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువ సేపు ఆకలిని నియంత్రిస్తుంది. తద్వారా బరువు తగ్గడంలోనూ, మధుమేహం ఉన్నవారికి, సహాయపడుతుంది. ఎక్కువ సేపు కదలకుండా , శారీరక శ్రమ లేకుండా ఎక్కువ సేపు కూర్చుని వర్క్ చేసేవారు అన్నానికి బదులు రొట్టెలను ఒక పరిమిత మొత్తంలో తీసుకోవడం మేలు.

చాలామంది అన్నం కంటే రొట్టెలు లేదా చపాతీలు ఎక్కువ ఆరోగ్యం అని చెప్పడానికి కారణం కొలత. చపాతీ లేదా రొట్టెలను కొలత పెట్టుకుని ఒకటి, రెండు అని లెక్క పెట్టుకుని తినవచ్చు. కానీ అన్నం విషయంలో అలా కాదు.. కూరలు ఓ రెండు మూడు రకాలు ఉన్నప్పుడు.. కూరలలో ఉప్పు, కారం ఎక్కువగా ఉన్నప్పుడు అన్నం ఎక్కువగా తినేస్తారు. ఇది శరీరంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ చేరడానికి కారణం అవుతుంది. అలా కాకుండా అన్నాన్ని ఒక కప్పు కొలత తీసుకుని దానికి సమాన పరిమాణంలో ఉప్పు కారం తక్కువ ఉండి కూరగాయలు ఎక్కువ జోడించిన కూరను ఒక కప్పు తీసుకుని భోజనం చెయ్యాలి. అన్నం, కూరలు సమాన పరిమాణంలో ఉండాలి. ఇలా చేస్తే ఆహారంలో అన్నం తీసుకున్నా పెద్దగా సమస్య ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *