చంద్రబాబుని పవన్ కళ్యాణ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..?
తమ ప్రభుత్వంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని స్వయంగా పవన్ కళ్యాణ్ అంగీకరించారు. నిజానికి అలాంటి విమర్శలు విపక్షం నుంచి వస్తుంటాయి. దానిని పాలక కూటమి నేతలు తప్పుబడుతూ ఉంటారు. అందుకు విరుద్ధంగా పరిస్థితి అదుపుతప్పిందని అధికారంలో ఉన్న డిప్యూటీ సీఎం చెప్పడంతో టీడీపీ డిఫెన్స్ లో పడింది.
పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక లక్ష్యం ఏమిటా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. యధాలాపంగా ఆయన ఇంతటి తీవ్రమైన విమర్శలు చేసి ఉండకపోవచ్చన్నది అంగీకరించాల్సిన విషయం. అందులోనూ లా అండ్ ఆర్డర్ తన చేతుల్లో లేని వంగలపూడి అనిత కూడా ఏమీ చేయలేదన్నది సైతం పవన్ కి ఎరుకలోనే ఉంటుంది. అయినప్పటికీ హోం మంత్రి వైఫల్యం మీద వ్యాఖ్యానించడం విశేషంగా కనిపిస్తోంది.
ఇటీవల నామినేటెడ్ పోస్టుల భర్తీలో జనసేనకు న్యాయం జరగలేదన్న విమర్శలున్నాయి. జనసేన శ్రేణులు బాహాటంగానే అసంతృప్తి వెలిబుచ్చుతున్నాయి. దానికి తగ్గట్టుగానే సీఎంను తన దారికి తెచ్చుకునే యత్నంలో పవన్ ఉన్నారా అన్న ప్రశ్న వినిపిస్తోంది. అదే సమయంలో క్యాడర్ లో ఉన్న అసహనానిక అద్దంపట్టేలా వ్యాఖ్యానించారా అన్న వాదన కూడా ఉంది. ఏమయినా ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టేంత స్థాయికి జనసేనాని వెళ్లడం వెనుక పక్కా రాజకీయ వ్వూహం ఉన్నట్టు కనిపిస్తోంది.
రాష్ట్రంలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు జనసేన వైపు చూస్తున్నారు. వారిని పార్టీలో చేర్చుకోవడానికి టీడీపీ అభ్యంతరాలు పెడుతోంది. దాంతో అనేక మంది వెయిటింగ్ లిస్టులో ఉండాల్సి వస్తోంది. వైఎస్సార్సీపీని వీడిపోయిన నేతలను కూడా చేర్చుకోవడానికి పవన్ పదే పదే ఆలోచించాల్సిన స్థితి ఉంది. ఉదాహరణకు పిఠాపురంలోనే మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి నెలలు గడిచిపోయింది. కానీ ఆయన చేరికను టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ వ్యతిరేకిస్తుండడంతో కండువా కదల్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోని పలువురు నేతలున్నారు.
వాటిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబుని బ్లాక్ మెయిల్ చేసేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. తన పార్టీ ఎదుగుదలకు అడ్డుపడితే సహించబోననే సంకేతం పంపించారా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలు ఆచితూచి వ్యవహరించడం వెనుక కారణం అదేనని అంచనా వేస్తున్నారు. నవంబర్ 6న జరగబోతున్న క్యాబినెట్ భేటీ సందర్భంగా రాజకీయంగా ఉన్న విబేధాల మీద చర్చలు జరిగే అవకాశం ఉంది. పరిష్కరించుకుంటారా లేక బాహాటంగా ఇలా పరువు తీసుకునే పనులు కొనసాగిస్తారా అన్నది ఆసక్తికరం.